Skip to content

పట్టు వస్త్రాలలో వర్ణ వివక్ష

భారత దేశంలో కుదిర్చిన వివాహాల క్లుప్త చరిత్ర
English  |  हिन्दी  |  தமிழ்  |  తెలుగు  |  मराठी

Translated into the Telugu by V Vamsi Viraj.

భారతీయ సినిమాకి ప్రేమంటే వల్లమాలిన ప్రేమ. పేదా-గొప్పల మధ్య ప్రేమని సంబరంగా చూపిస్తుంది; మతం, ప్రాంతం, భాషలను దాటి వికసించే ప్రేమను; లింగం లేదా లైంగికతలు కూడా దాటే ప్రేమను కూడా! బయట దేశాలనుంచి ఎవరైనా ఈ సినిమాలు చూసి భారత ఎంతో ప్రేమించే సమాజం అని అనుకుంటే వారిని తప్పు పట్టలేం. కానీ నిజం ఈ సినిమా ప్రపంచానికి చాలా దూరంగా ఉంటుంది. భారత్లో ప్రేమ లేదా పెళ్లి సంబంధాలన్నిటి మధ్య ఉండే దారుణమైన వాస్తవాన్ని బాలీవుడ్ నిజాయితీగా చూపించలేదు – ఆ వాస్తవమే కులం.

ఉదాహరణకి, బాలీవుడ్ లో అందరు చూసే “కుటుంబ కథా చిత్రాలు” తీసుకుందాం. ఇలాంటి సినిమాలు డబ్బున్న మధ్య-తరగతులకు తగట్టుగా ఉన్నా వీటికి ప్రేక్షకులు విస్తృతంగా ఉంటారు. అప్పట్లో మాకు కేబుల్ కనెక్షన్ పెట్టించుకునే స్థోమత లేదు, మా బ్లాక్ అండ్ వైట్ టీవీలో పెద్దగా ఏమి వచ్చేవు కావు. అందుకని నేను పొరుగు వాళ్ళింట్లో సినిమాలు చూసేవాణ్ణి. 3 గంటల దాకా సాగే ఈ సినిమాలు చివరికి పెళ్లితో ముగుస్తాయి. కానీ అక్కడికి వెళ్లేముందు, వీక్షకుడుకి ఎన్నో పాత్రలు కనిపిస్తాయి. సాధారణంగా ఇవి ప్రేమలో ఉన్న జంటల ఉమ్మడి కుటుంబాలు లేదా వారి బంధువులు అవుతారు. దీనికి తోడు వీరి చిగురించే ప్రేమకు తోడ్పడే లేదా హాని కలిగించే చిన్న చిన్న అంశాలు ఉంటాయి – రెండు కుటుంబాల వ్యాపార సమస్యలు, వారసత్వ సంపద మీద గొడవలు, జిత్తులమారి పెద్దన్నయ్య ఒకడు, హిందూ పండగ సంబరాలు (సంగీతంతో సహా). ఎలాగైనా కానీ చివరికి వధువు వరుడు సంతోషంగా ఒక్కటవుతారు.

ఇదంతా చూడడానికి మామూలుగానే ఉంటుంది. కానీ నిశితంగా చూస్తే ఈ క్లిష్ట కథనంలో ఉన్న వివిధ కుటుంబ-అంశాలు లేదా కలహాలు ఇక్కడ జరుగుతున్న వివాహం కుదిర్చిన వివాహం అనే విషయం దాచడానికి మాత్రమే. ఈ విషయాన్నీ ఆ సినిమా చెప్పీచెప్పకుండానే ఆమోద ముద్ర వేస్తుంది. భారత్ వెలుపలి పాఠకులు కుదిర్చిన వివాహం అనేది – యువత తమకు తాముగా అమ్మానాన్నలకు లేదా కుటుంబ పెద్దల అధికారానికి తలొగ్గి వారు చూసే ‘సరైన’ సంబంధాన్ని చేసుకునే భారతీయ ‘సంప్రదాయం’ అనుకుంటారు. దీనిలో కొంత మంది గొప్ప గొప్ప విలువలను కూడా చూస్తారు. కానీ ఈ కథనం పుస్తకంలో చదివే అందమైన కథలాంటిది. నిజంగా చెప్పాలంటే కుదిర్చిన వివాహాలు కుల వివాహాలకు మారుపేరు. అంటే ఒకే కులానికి చెందిన ఇద్దరి మధ్య కుటుంబ పోలీసులు – అమ్మానాన్నలు, పెద్దలు, మావయ్యలు, అత్తలు, దూరపు బంధువులు – కుదిర్చిన వివాహం. కుల రక్తం ‘పవిత్రంగా’ ఉండాలని, కింద కులాల ‘నీచ’ రక్తం లేదా ‘అంటరాని’ కులాలు అనబడే వారి రక్తం కలిసి వారి రక్తం చెడిపోకుండా ఉండాలన్నదే వీరికి కావాలి.

ఇలాంటి ఊహాజనిత కుటుంబ కధాచిత్రాలు ఉండడానికి కారణం: భారత అగ్ర కులాలు (రెండు సార్లు జన్మనెత్తే ద్విజులుగా పిలవబడే హిందువులు) తమ పలుకుబడిని బాలీవుడ్ పై ఉపయోగించి వారి సంకుచిత, ఆడంబర, ఉన్నత కుల సంస్కృతే భారత సంస్కృతి అన్నట్టు చూపిస్తూ వచ్చారు (నిజానికి, పంజాబ్ ఖత్రి కులపు పెళ్లిళ్లు భారత పెళ్లి సంస్కృతిగా చూపించబడతాయి). ఈ అగ్రకులాలు జనాభాలో 18 శాతం ఉంటారు. వారి ఆహారం, వస్త్రాలు, ఇళ్ళు, తివాసీలు, చీరలు, బొట్టు, పండగలు, ఆరాధించే దేవుళ్ళు అన్నీ ఉన్నత కుల ప్రపంచానివి. భారత జనాభాలో సుమారు 70 శాతం ఉన్న దళితులు, ఆదివాసీలు, వెనకబడ్డ కులాల సంస్కృతిని, వారి ఉనికినే బాలీవుడ్ చాలావరకు కప్పేస్తుంది. ఇలాంటి వేర్పాటువాద సంస్కృతి ప్రస్తుతమున్న అసమాన పరిస్థితులనే బలపరిచేలా ఉంటుంది. ఇందులో ద్విజ కులాలు తమలో తాము పెళ్లి చేసుకుని తమ పిల్లలని, ముఖ్యంగా తమ కూతుళ్ళని, తమ వర్గంలోనే ఉంచి తమ కుటుంబ కుల సంబంధాల ద్వారా వచ్చే లాభాలను తామే అనుభవిస్తూ ఉంటారు. ఈ సంబంధాలన్నిటికి ఆధారమైన నిర్మాణాత్మక హింస మాత్రం మనం చూసే సినిమాల్లో చెరిపేయబడుతుంది.

దీనికన్నా అధ్వాన్నం ఏంటంటే కుటుంబాలతో సంబంధం లేని ప్రేమ పెళ్లిళ్లు బాలీవుడ్ చూపించినప్పుడు, కులం గురించిన కనీస అవగాహన చూపదు. నిజ జీవితంలో ఒకరు ధైర్యం చేసి ప్రేమ పెళ్లి చేసుకుంటే, అది కులాంతర వివాహమైతే ఎంత సంక్షోభం ఎదురవుతుందో, ఎంత హింస ఎదుర్కొనాలో అస్సలు చూపించదు. బాలీవుడ్ స్వప్నలోకానికి పూర్తి భిన్నంగా, కులాంతర సంబంధాలకు వ్యతిరేకంగా ఇప్పుడు కూడా చట్టాన్ని కాలరాస్తూ గ్రామీణ భారతంలో ఆటవిక అల్లర్లు అతి హింసాత్మక దాడులు జరుగుతాయి. (ప్రసార మాధ్యమాలలో వీటినే మృదువైన భాషలో ‘పరువు హత్యలు’ అంటారు). తరచుగా కుల వ్యవస్థ కింద వరసకు చెందిన వ్యక్తే ఈ హింసకు గురవుతారు; కొన్నిసార్లు వారిని అగ్ర కులానికి చెందిన వ్యక్తి కుటుంబం నరికి చంపుతుంది). నేను ఇది రాస్తుండగా, ఒక వార్తా శీర్షిక నాకు కానవచ్చింది: “దళిత పురుషునితో ప్రేమలో ఉన్న మహిళను హత్య చేసిన అమ్మానాన్నలు, అన్నయ్య.” ఒక దళితునితో సంబంధం ఉందన్న కారణంతో సొంత కుటుంబమే తనని గొంతు నులిమి చంపింది. దర్యాప్తు అధికారి ప్రకారం, “భారతి అమ్మ రశ్మి తన ఛాతీ మీద కూర్చుని తన మొహాన్ని తలగడతో నొక్కేసింది, మనీష్ తన చేతులు బలంగా పట్టుకున్నాడు. చనిపోయిన తరవాత, నాన్న అన్నయ్య శవాన్ని తన గది పైకప్పు నుంచి వేలాడ తీసి తాను ఆత్మ హత్య చేసుకున్నట్టు చూపించారు.” కేవలం కుటుంబ రక్తసంబంధాలని పవిత్రంగా ఉంచడానికి, ఇది కూతురి ప్రాణం కన్నా ముఖ్యమని భావించి, ఈ ఘోర హత్య చేశారు. కుల వ్యవస్థ మొత్తం దళితుని రక్తం అంటే అంత భయపడుతుంది.

అసలు చట్టానికి భయం లేకుండా ఇలాంటి ఆటవిక పనులు ఇంకా జరుగుతున్నాయంటే, కుదిర్చిన వివాహానికి సంబంధించిన ‘సంప్రదాయ’ విలువల గురించీ, ఈ దుర్మార్గాన్ని దాచే బాలీవుడ్ గురించీ, మనం పునరాలోచించాలి. ఇప్పుడు కూడా ఏ తరగతిలోనైనా కుదిర్చిన వివాహాలు సర్వ-సాధారణంగా జరుగుతుంటాయి. భారత సమాజాన్ని అర్ధం చేసుకోవాలంటే కుదిర్చిన వివాహ వ్యవస్థను అర్ధం చేసుకోవాలి. యువ భారత్తీయులలో 75 శాతం మంది కుదిర్చిన వివాహాన్ని ఇష్ట పడతారని ఇటీవల తాజ్ హోటల్స్ గ్రూప్ జరిపిన ఒక సర్వే కనుగొంది. ఉత్తర భారతంలో 82 శాతం స్త్రీలు తమ భాగస్వాములను తల్లితండ్రులే వెతికిపెట్టడాన్ని ఇష్టపడతారు. ఇలాంటి లక్షలాది దురదృష్టవంతుల వైవాహిక జీవితం ఎలా ఉండబోతోంది? పెద్దలు వీరిని ఎలాంటి చిత్రహింసలకు సిద్ధం చేశారు? మీకు పూర్తి రామాయణం చెప్తా పదండి.

పెళ్లి సంతలు

కుదిర్చిన వివాహాలు రకరకాలుగా జరుగుతాయి. చాలా సులభంగా జరిగేవి మీ కుటుంబంలోని పెద్దలు, లేదా మీ జాతి పెద్దలు (జాతి అంటే సుమారుగా “కులం లేదా వర్గం”), లేదా మీ సాంస్కృతిక-మత సంస్థ ద్వారా పెళ్లి కుదర్చబడతాయి. తరచుగా, వధూవరుల జాతకాలు చూసి సంబంధం మంచిదా కాదా అని తనిఖీ చేస్తారు. జాతకం నప్పని పక్షంలో చాలా కుటుంబాలు వ్యధ చెందుతారు. మూఢ నమ్మకాలున్న సమాజంలో ఇలాంటి అద్భుతాలెన్నో.

మీ కుటుంబ సభ్యులు మీ కోసం ఒక సంబంధం కనుగొనలేకపోతే, పెళ్లి జాతరలు కూడా ఉన్నాయి. ఇక్కడ కొడుకులు కూతుళ్లు మార్కెట్లో సరుకుల్లా ప్రదర్శింప బడతారు. (ఇది లండన్ రివ్యూ ఆఫ్ బుక్స్లో యున్ షెంగ్ వివరించిన చైనీయుల పెళ్లి మార్కెట్లకు అంత భిన్నం కాదు)

కుదిర్చిన వివాహసంబంధాలు భారత్ లో పెద్ద వ్యాపారం. పాతకాలపు వివక్షకు ప్రపంచీకృతమవుతున్న సంపదకు మధ్య ఉండే కాల కూటమిని ప్రతిబింబిస్తుంది.

కానీ ఆధునిక పద్ధతులతో పోలిస్తే ఈ రకమైన సాంప్రదాయ పద్ధతులు పెద్ద విషయం అనిపించవు. ఏదైనా భారతీయ వార్తాపత్రికను తెరవండి, పెళ్ళి సంబంధాల కోసం ఒకటి లేదా రెండు పేజీలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. నిస్సిగ్గుగా ఈ పేజీని కులాన్ని బట్టి చిన్న చిన్న భాగాలుగా విభజిస్తారు. తద్వారా మీరు మీ కులానికి చెందినవారిని మాత్రమే పెళ్ళాడి మీ కుటుంబం బ్రష్టు పట్టే ప్రమాదం తప్పుతుంది. ఇటువంటి పిచ్చిని ఎదుర్కోవటానికి భారతదేశపు అతిపెద్ద ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా, కులం గురించి ప్రస్తావించని మరియు కుల-ఆధారిత ఎంపికలను ఉదహరించని వారికి మ్యాట్రిమోనియల్ ప్రకటనలపై 25 శాతం తగ్గింపును అందించేది. ఆఖరికి కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి వారు “కుల పట్టింపు లేదు ” అనే ప్రత్యేక విభాగాన్ని కూడా సృష్టించారు. కానీ ఉన్నత కుల భారతీయులు ఇక్కడ కూడా లొసుగులు కనుగొన్నారు. “కుల పట్టింపు లేదు” విభాగాలలో ప్రకటన చేసే వారిలో కొందరు తమ సొంత కులాన్ని ప్రస్తావిస్తూ వారి వర్గాలకు సంకేతం పంపుతారు. మరీ వెర్రెత్తిన ఒక ఉదాహరణలో – కుల పట్టింపు లేదు విభాగంలో ఒక దరఖాస్తుదారుడు ఎగువ కులం మాత్రమే అనే శీర్షిక పెట్టాడు. (ఈ వైరుధ్యం బహుశా పై కులాల్లో ఉన్న లెక్కలేని జాతుల వలన అయ్యుండొచ్చు). ఇలాంటి వివక్ష అప్పుడప్పుడు బహిరంగంగా చాలా నీచంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, దరఖాస్తుదారుడు ‘కులమేదైనా పర్లేదు, ఎస్సీ / ఎస్టీ తప్ప’ అని ప్రకటిస్తాడు. (అధికారికంగా అణగారిన వర్గాలన ఎస్సీలు అంటే షెడ్యూల్డ్ కులాలు గాను, గిరిజనులు లేదా ఆదివాసీ తెగలను ఎస్టీలు అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ గా పిలుస్తారు).

ఇప్పుడు పెళ్లి సంబంధాలు ఏర్పాటు చెయ్యడంలో కృత్రిమ మేధస్సు కూడా ఉపయోగించబడుతుంది. ఇటీవలి సంవత్సరాలలో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు విస్తరించాయి – వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందినవి బహుశా భారత్ మ్యాట్రిమోని మరియు “షాదీ.కామ్”. ఇవి అందించే అధునాతన ఫిల్టర్లు ఉపయోగించి వంశం , కులం మరియు సంబంధాలు లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని సేవలు అందిస్తున్నాయి. అసలుకి ఇలాంటి వెబ్సైట్లు నగరాలు లేదా టౌనులు లాంటి చోట్ల ఎవరైనా తమ కులానికి అతీతంగా సంబంధాలు వెతకడానికి అనువుగా ఉండే అవకాశం కల్పించాలి. దీనికి బదులు, ఇవి అనాగరిక వేద నియమాలు దృఢపరచడానికి తోడ్పడుతున్నాయి. ఇలాంటి పురాతనమైన వివక్షలు చాలవన్నట్టు, ఇప్పుడు దేశంలోనే పేరు మోసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశ్వవిద్యాలయాల యొక్క గ్రాడ్యుయేట్ల కోసం ప్రత్యేకంగా సైట్లు పుట్టుకొచ్చాయి. కులం తరగతి ప్రతిష్టలను ముందుకు కొనసాగిస్తూ ఈ వెబ్సైట్లు విడ్డూరంగా ‘అల్మా మేటర్ మేటర్స్’ (alma mater matters – చదివిన కాలేజీ చాలా ముఖ్యం) అని ప్రకటించుకుంటాయి.

లోతుగా పరిశీలించి చూస్తే, కుదిర్చిన వివాహసంబంధాలు భారత్ లో పెద్ద వ్యాపారం అని తెలుస్తుంది. పాతకాలపు వివక్షకు ప్రపంచీకృతమవుతున్న సంపదకు మధ్య ఉండే కాల కూటమిని ప్రతిబింబిస్తుంది (చెప్పాలంటే కుటుంబంలో కృత్రిమ మేధస్సు కూడా ఒక ఇంటి పెద్దగా అవతరించింది). భారతదేశంలో ఏర్పాటు చేసిన వివాహ పరిశ్రమ సంవత్సరానికి 50 బిలియన్ డాలర్లు విలువైనదని, ప్రతి క్షణం ఇలాంటి కుదిర్చిన తృప్తిలేని వివాహం కోసం 63 లక్షల మంది బ్రహ్మచారులు వెతుకుతున్నారని ది ఎకనామిస్ట్ వారపత్రిక ఇటీవల నివేదించింది. ఇలాంటి వెనకబడ్డ ఆలోచనలు మన దేశానికి మాత్రమే పరిమితం కాదు. చాలా మంది విదేశాలలో ఉన్న భారతీయలు తక్కువ వ్యవధిలో వీలైనన్ని సంబంధాలు చూడడానికి భారతదేశానికి వచ్చి కుదిరితే వధువు లేదా వరుడితో వెన్నక్కి వెళ్తారు. (న్యూజెర్సీ నివాసితులు, మీరు తప్పకుండా ఇలాంటి కొద్దిమందిని కలిసే ఉంటారు!). అమెరికాలో ఐటి ప్రొఫెషనల్‌గా పనిచేసే నా స్నేహితుడొకరు ఆన్‌లైన్‌లో దొరికిన సంబంధాన్ని లేదా కుటుంబం అతని కోసం ఏర్పాటు చేసిన అభ్యర్థులను కలవడానికి ప్రతి ఆరునెలలకోసారి భారతదేశానికి వెళ్లే వాడు. ఈ తతంగం పూర్తి చేసి పెళ్లి చేసుకోడానికి అతనికి మూడు సంవత్సరాలు పట్టింది. అతనిలా నిర్ణయం తీసుకోవటానికి కారణం అతని వయస్సు, తన ముప్ఫైల మధ్యలో ఉన్నాడు. దీనికి తోడు తన అవసరాలకు తగట్టు అమ్మాయి దొరుకుంతుందో లేదో అని ఆందోళన చెందాడు. తమ కొడుకు స్వలింగ సంపర్కుడు కాదని తెలిసి అతని కులాహంకార తల్లిదండ్రులు ఆనందించి ఉంటారనడంలో సందేహమే లేదు.

ఇలాంటి కుదిర్చిన వివాహాల వలన అమ్మాయిలే ఎక్కువ అణచివేత ఎదుర్కొంటారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా చెప్పాలంటే, కుదిర్చిన వివాహ వ్యవస్థలో ఒక ఆడపిల్లని పరుల ధనంగా పరిగణిస్తారు, తన అసలైన ఇల్లు తన అత్తవారిల్లుగా భావిస్తారు. ఈ భావన ఆమెను భవిష్యత్తులో తన అత్తవారింటికే తిరిగి ఇవ్వాల్సిన రుణం లేదా పెట్టుబడిగా మార్చేస్తుంది. భారతదేశంలో వధువులలో కేవలం 5 శాతం మాత్రమే తమ భర్తను స్వయంగా ఎన్నుకున్నారని భారతీయ అభివృద్ధి మానవ సర్వే (Indian Human Development Survey) కనుగొంది. సంబంధాలను ఖాయం చేసుకోడానికి ముందు 55 శాతం కుటుంబాలు మాత్రమే తమ కుమార్తె అభిప్రాయం తీసుకున్నాయి; పెళ్లి రోజున లేదా పెళ్లికి కోద్ది రోజుల ముందు 65 శాతం మంది వధువులు మాత్రమే తమకు కాబోయే భర్తను కలిసి లేదా పరిచయం కలిగి ఉన్నారు. వివాహానికి కనీసం ఒక నెల ముందు తమ భాగస్వామిని తెలిసిన వారు 15 శాతం మాత్రమే. అలాగే, సర్వేలో 62 శాతం మంది విద్యావంతులైన మహిళలు వివాహానికి ముందు తమ భాగస్వాములతో పరిచయం చేసుకోలేదని చెప్పారు.

మొత్తంగా చూస్తే, లైంగికత, కోరిక మరియు ఎంపికలపై సంపూర్ణ నియంత్రణగా కుదిర్చిన వివాహ వ్యవస్థ కనిపిస్తుంది. మరొకరు తమకు ముందుగానే నిర్ణయించిన జీవితాన్ని ఎలా గడపాలి అని చెప్పే సాధనం ఇది. పూర్వం జైళ్లలో ఖైదీలను తప్పించుకోకుండా ప్రాంగణం మధ్యలో ఎత్తైన కట్టడం నుంచి పోలీసులు చూస్తూ ఉంటారు. ఇలానే నేటి యువత ‘తప్పిపోకుండా’ ఉండడానికి ఈ కుదిర్చిన వివాహ వ్యవస్థ సమాజపు మూల స్తంభంగా వారిని పర్యవేక్షిస్తూ ఉంటుంది.

ఇది ఎలా సమర్థించబడుతుంది? అసలు వారి పిల్లల కోసం భాగస్వాములను ఇలా కష్టాలు పడి వెతకాల్సిన అవసరం ఏంటి అని అడిగితే ఏదో కప్పిపుచ్చుతున్నట్టుగా అస్పష్టమైన సమాధానాలు వస్తాయి. చాలా మంది సొంత కులం వారిని పెళ్లి చేసుకోవడం సులభమని చెబుతారు: అలవాట్లు, ఆహారం, ఆచారాలు, మతం ఒక్కటైతే అపరిచితుల ఇంట్లో సర్దుకుపోవడం చాలా సులభం అంటారు. (ఇక్కడ అపరిచితులు ఎవరంటే అమ్మాయిని వివాహం చేసుకునే కుటుంబం.) ఇతరులు రెండు కుటుంబసభ్యులలో మంచి సంబంధాలను కొనసాగించడానికి కుల సంబంధాలు మంచివని చెప్పేంతవరకూ వెళతారు. మీకు వారి వాదనలు ఎలా అర్ధమైనా , కుదిర్చిన వివాహాలలో వ్యక్తుల కంటే, మొత్తం కుటుంబాల మధ్య బంధాలు ఏర్పడతాయన్నది నిజం. భారతదేశంలో 95 శాతం జంటలు వివాహం తరువాత వారి తల్లిదండ్రులతో మరియు బంధువులతో నివసిస్తారని తాజా సర్వేలో తేలింది. 70 శాతం వధూవరులు కుటుంబంతో పదేళ్లకు మించి ఉన్నారు. ఇది ఒక పెళ్ళైన జంట తీసుకునే పెద్దా చిన్నా నిర్ణయాలపై కుటుంబ సభ్యులు అధిక ప్రభావాన్ని చూపే వాతావరణాన్ని కలిగిస్తుంది (పిల్లల్ని ఎప్పుడు కనాలి, ఎంత మందిని కనాలి, ఇలా మొదలైనవి). ఈ వెలుగులో చూస్తే వివాహం కుటుంబ ఆర్థిక వ్యవస్థలో ఒక భాగం మాత్రమే. భారతదేశంలో కుదిర్చిన కుల-వివాహం సమాజం మరియు తక్షణ కుటుంబం యొక్క కోరికను సంతృప్తిపరుస్తుంది, కానీ ఈ పాత కాలపు ఆచారాల భారీ మూల్యం భావితరాల వారు మోయాల్సి వస్తుంది.

కులం పుట్టుపూర్వోత్తరాలు

ఇప్పటికి మీరు తప్పకుండా భయపడి ఉండాలి. ఆధ్యాత్మికత, ఏనుగులు, రంగురంగుల దుస్తులకు ప్రతీకగా ఉండే భారతదేశంలో ఇంత స్పష్టంగా శ్రేణులుగా విభజించబడిన వివాహ వ్యవస్థ ఉందా? భారతదేశం ఈ పరిస్థితికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే మీరు కుల వ్యవస్థ గురించి కొంత నేర్చుకోవలసి ఉంటుంది. దేశానికి ఈ వ్యవస్థ ప్రాధమిక సామాజిక స్థంభం లాంటిది. కులం యొక్క ఈ మూలాలు సాధారణంగా శాస్త్రీయ హిందూ మత గ్రంధాలలో కనిపిస్తాయి. భగవద్గీతలో భగవంతుడు తాను చతుర్వర్ణ వ్యవస్థ యొక్క సృష్టికర్త అని ప్రకటిస్తాడు. ఇది సమాజాన్ని నాలుగు ఖండాలుగా విభజిస్తుంది – బాహ్మణులు (ప్రధాన పూజారులు), క్షత్రియులు (సైనికులు, యోధులు), వైశ్యులు (వ్యాపారవేత్తలు, వర్తకులు) మరియు శూద్రులు (రైతులు, కార్మికులు). ఈ వర్గాలలో ఒక నిర్దిష్ట వృత్తితో (మత్స్యకారులు, తోటమాలి, ఉపాధ్యాయులు మరియు మొదలైనవి) సంబంధం ఉన్న వేలాది “జాతులు” లేదా వర్గాలు ఉంటాయి. ఇక్కడ “అంటరాని” జాతులు కూడా ఉన్నారు – అనగా సాంప్రదాయకంగా అత్యంత అవమానకరమైన లేదా అశుద్ధమైన పనులని చేసే వివిధ కులాలు మరియు ఉపజాతులు ఈ కుల సమూహం కిందకు వస్తాయి. నామమాత్రంగా ఈ ‘అంటరాని’ వారిని కుల వ్యవస్థ వెలుపల ఉన్నట్లు భావిస్తారు.

తరగతి లాగా కులం అనేది ఒకరు చేసే పని ఆధారంగా జరిగే క్రూరమైన విభజన. అట్టడుగున ఉన్నవారి బలహీనతలపై దెబ్బకొడుతుంది. ఆర్థిక ఉత్పత్తులను కఠినంగా నియంత్రించడం ద్వారా ద్విజ కులాలు – బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు – వ్యవస్థలో పాతుకుపోయిన ఉత్పాదక నైపుణ్యాలపై ఆధిపత్యం కొనసాగిస్తారు. భారతీయ ఆర్థిక వ్యవస్థపై వారి అపారమైన నియంత్రణ ఈనాటికీ ఉంది. అయినప్పటికీ కుల హింసకు ప్రత్యక్షంగా కనపడని అంశం కూడా ఉంది. స్థాయి బద్ధంగా నిర్మించబడిన ఈ వ్యవస్థ పవిత్రత-కాలుష్యం అనే భావాలతో ఒకరిని నీచ దశకు దిగజారుస్తుంది. నిచ్చెన లాంటి ఈ వ్యవస్థలో ప్రతీ కులానికి ఒక స్థాయి, ఒక పవిత్రత లేదా అపవిత్రత ఉంటుంది. నిచ్చెనపైనున్న ప్రతీ ఒక్కరు తమ కింద కింద స్థాయిలో వారిని తమకన్నా కలుషితమైన వారిని చిన్నచూపు చూస్తూ లేదా తొక్కేస్తూ ఉంటారు. కుల నిచ్చెనలో అతి దిగువ భాగంలో ఉన్న వారి కలుషితమైన దేహాలు సమాజం నుండి అక్షరాలా “బహిష్కరించబడ్డాయి” – పైకి పవిత్ర స్థలాలుగా కనపడే దేవాలయాలలోకి ప్రవేశించకుండా నిరోధించబడ్డాయి. వీరిని రాజకీయ మరియు సాంస్కృతిక చర్చల నుండి దూరంగా ఉంచారు, సామాజిక శ్మశానాల నుంచి కూడా నిషేధించారు. హీనాతిహీనంగా వారిపై కళంకాలు నిందలు మోపి కులాహంకార హిందువులు వారిలో వివిధ రకాల మురికి-మలినాలు ఉన్నాయని నమ్మేవారు. చాలా తీవ్రమైన సందర్భాల్లో, ఒక దళితుడి నీడ, ఉమ్ము పాత్ర లేదా చూపు అన్నీ అశుద్ధమైనవిగా పరిగణించబడ్డాయి. ఈ అడ్డంకులను అధిగమించడానికి ప్రయత్నించే దళితుడు నాటికి నేటికి కులాహంకార హిందువుల నుంచి హింసకు గురవుతాడు. ఖాప్ పంచాయితీలు వంటి అనధికారిక గ్రామ పరిషత్తుల ద్వారా కులాచారాల ప్రకారం స్థానిక కార్యకలాపాలు నడిచేలా అనధికార పోలీసులా వ్యవహిస్తారు. రాష్ట్ర వ్యవస్థలకంటే ఈ పంచాయతీలకు ఆ ఊరిలో వ్యక్తిగత వ్యవహారాలపై ఎక్కువ పెత్తనం ఉంటుంది. దళితుల దేహాలపై హింస యొక్క చిహ్నం ఎల్లప్పుడూ ఉంటుంది.

లైంగికత, కోరిక మరియు ఎంపికలపై సంపూర్ణ నియంత్రణగా కుదిర్చిన వివాహ-వ్యవస్థ కనిపిస్తుంది. మరొకరు తమకు ముందుగానే నిర్ణయించిన జీవితాన్ని ఎలా గడపాలి అని చెప్పే సాధనం ఇది.

స్త్రీల అణచివేతయే బలమైన పునాదిగా కులం నిలిచింది, దీనిని పండితులు ఉమా చక్రవర్తి “బ్రాహ్మణ పితృస్వామ్యం”గా అభివర్ణించారు. ఉపఖండంలో ఆర్యుల దండయాత్ర సమయంలో ఈ సామాజిక వ్యవస్థ ఉద్భవించింది. దీని వలన ఆది నుంచి ఉంటున్న స్థానిక జనాభా ఆడామగా అందరూ ఆర్యుల ఆధిపత్యం కింద బానిసత్వానికి గురయ్యారు. కాలక్రమేణా వీరంతా కింద/తక్కువ కులాలుగా మారారు, ఆర్యులు ఉన్నత కులాలుగా మారారు. ఉమా చక్రవర్తి గారు పురాతన సంస్కృత గ్రంథమైన రుగ్వేదంలో ఒక రకమైన లైంగిక బానిసత్వం యొక్క సాక్ష్యాలను కనుగొన్నారు. దీనిలో వేర్వేరు కులాల మహిళలకు వేర్వేరు పనులు కేటాయించబడ్డాయి. అగ్రశ్రేణిలో ఉన్న బ్రాహ్మణ స్త్రీలు ఉన్నత కుల వారసులను కనడానికి ఉంటారు. ఆచారపరంగా ఏర్పాటై ఆధిపత్యం-అణచివేత అంశాలు ముఖ్యమైన ఇలాంటి వ్యవస్థలో ఆర్య బ్రాహ్మణ స్త్రీలకు ఎంతో మేలు చేకూరుతుంది. వారు బానిసలు మరియు పశువులపై పాలన సాగించారు. ఈ బానిసలు వేరెవరో కాదు, బహిష్కృతులై అతి నీచ వర్గాలకు చెందిన అణచివేయబడ్డ ఆదివాసీ తెగలు. మరో వైపు, కింద కులాలకు చెందిన మహిళలు వారు చేసే నీచ చాకిరీ పనుల వలన అపవిత్రులుగా అశుద్ధతకు మారుపేరుగా పరిగణించబడతారు. అందుకని, కింద కులాల వారిని పెళ్లి చేసుకుని సెక్స్ ద్వారా కుల స్వచ్ఛత కోల్పోయే అవకాశం ఉండడం అగ్ర కుల పురుషులని భయభ్రాంతుల్ని చేసింది. ఇలా జరగకుండా ఉండడానికి శూద్రులు తమ పై కులాలను వివాహం చేసుకోవడాన్ని నిషేధిస్తూ చట్టాలు చేశారు.

అలాగని కులాంతరపరమైన లైంగిక సంపర్కం లేదని కాదు. వాస్తవానికి బ్రాహ్మణ పురుషులకి ప్రతీ కులానికి చెందిన మహిళపైన పూర్తి హక్కులుండేవి – ఒక విధమైన అత్యాచారం లాంటి ఈ సంపర్కాలు అసలెప్పుడూ పెళ్ళికి దారి తీయవు. తీవ్రమైన సందర్భాల్లో, దళితులు లేదా “కింద” కులాలు బానిసలుగా లేదా వ్యవసాయ కూలీలుగా ఉన్న చోట, అగ్ర కుల ప్రభువులు “దిగువ” కుల మహిళపై అత్యాచారం చేసేవారు. ఇలా భవిష్యత్తులో కూడా తమ కోసం కూలీలను సృష్టించుకునేవారు. చెప్పాలంటే, ఇరవయ్యవ శతాబ్దం వరకు గ్రామీణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, దళిత వధువులు వివాహం చేసుకున్న భర్తతో సంభోగం చేయడానికి ముందే అగ్ర కుల భూస్వాముల అత్యాచారానికి లొంగిపోవలసి వచ్చేది. ఇలా వారి కుటుంబ గౌరవాన్ని నియంత్రించడం, అణచివేయడం దళిత మహిళపై అత్యాచారం కోసం జరుగుతుంది. ఇలా తనని బలాత్కరించి, ఒక అగ్ర కులస్థుడు తన పనివాని కుటుంబం మనసాక్షి మీద తన ఆధిపత్య గుర్తు వేస్తాడు. ఇలా వేరొకరు తన భార్యను ‘రుచి’ చూడడం వలన ఆ మగాడు తన గౌరవం కోల్పోతాడు. అతని కోపాన్ని అణగదొక్కి, అణగారిన వర్గాల దేహాలపై అగ్ర కుల ప్రభువు తన అజమాయిషీని మళ్ళీ మళ్ళీ సృష్టిస్తాడు. ఆ దేహాలను ఎప్పుడైనా తాను అణచివేయొచ్చని గుర్తు చేస్తాడు. లోతుగా చెప్పాలంటే, స్త్రీ శరీరాల లోనా శరీరాలపైనా నిర్మించబడినదే కులం. కులం ఒకరి భాగస్వామి శరీరం మీద అమలవుతుంది.

గత వేల సంవత్సరాలలో భారతీయ సమాజం ఎన్నో మార్పులు చెందింది, అన్ని రకాల కుల వివక్షలను దేశ రాజ్యాంగం నిషేధించింది. కానీ దిగ్భ్రాంతి కలిగించేలా దేశ సంస్కృతి మరియు రాజకీయ యంత్రాంగం చాలా వరకు సాంప్రదాయ కుల శ్రేణుల ఆధారంగానే దాపురించి ఉన్నాయి.

2010లో‌ దక్షిణ గుజరాత్ కి చెందిన నవసర్జన్ అనే ఒక దళిత సంస్థ ఇఛ్చిన నివేదిక ప్రకారం 98.4 శాతం గ్రామాలలో కులాంతర వివాహాలు నిషేధించబడ్డాయి. 1954 నాటి ప్రత్యేక వివాహ చట్టం యొక్క నిబంధనలు ఉన్నా కూడా భారత ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ పారితోకం ప్రకటించినా కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) మరియు మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే (IHDS) ప్రకారం, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వివాహాల్లో కేవలం 5 శాతం మాత్రమే కులాంతర వివాహలుగా పరిగణించవచ్చు. జాతుల మధ్య జరిగే వివాహాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇదే సర్వే 30 శాతం గ్రామీణ మరియు 20 శాతం పట్టణవాసులు అంటరానితనాన్ని ఇంకా పాటిస్తున్నట్లు గుర్తించింది. ఈ రోజు కూడా చాలా గ్రామాలు కులాహంకార పెద్దలు నడిపే అనధికారిక గ్రామ పంచాయతీల (ఖాప్ పంచాయతీ) ఆదేశాల ప్రకారం పని చేస్తాయి. వ్యక్తిగత వ్యవహారాలపై ఈ పంచాయతీలకు రాష్ట్ర వ్యవస్థల కంటే ఎక్కువ పెత్తనం ఉంటుంది. ముళ్ల కంచె లాంటి కుల నియమ-నిర్బంధాల మధ్య ఎంతో మంది దళిత వధువులకు స్వేచ్ఛ దొరకదని వేరే చెప్పక్కర్లేదు.

ఇలాంటి పైత్యం మధ్య కొన్ని హాస్యవిషాదాలు కూడా ఉంటాయి. ఉత్తర్ ప్రదేశ్లో ఇటీవల జరిగిన సంఘటన వివరాల్లోకి వెళ్తే: హిందూ-నియంతృత్వ భారతీయ జనతా పార్టీకి చెందిన బ్రాహ్మణ శాసన సభ్యులు రాజేష్ మిశ్రా 24 ఏళ్ల కుమార్తె సాక్షి మిశ్రా 29 ఏళ్ల దళితుడైన అజితేష్ కుమార్ తో ప్రేమలో పడింది. ఈ వ్యవహారం తెలిసినప్పుడు సాక్షి తండ్రి దీనిని బహిరంగంగా ఖండించారు, ఆయనకి ఆ ప్రాంతంలోని మొత్తం మిశ్రా వర్గం మద్దతు ఇచ్చింది. ఆయన ఆమెకు మరణ బెదిరింపులను జారీ చేసేంతవరకు వెళ్ళాడు, పైగా అజితేశ్‌ను చంపడానికి గూండాలు పంపబడ్డారు.

కానీ సాహసోపేతమైన మలుపులో సాక్షి అజితేశ్‌లు ఆ ప్రాంతం నుండి పారిపోయి పోలీస్ రక్షణ కోసం సామజిక మధ్యమాన్ని ఆశ్రయించారు. వారు తప్పించుకు పోయేటప్పుడు కారు వెనుక సీట్లో కూర్చొని చిత్రీకరించిన వీడియోలో “నేను సంతోషంగా స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను” అని సాక్షి ధృవీకరించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఆమె తన తండ్రిని ఉద్దేశించి, అజితేష్ కుటుంబం తరఫున మాట్లాడుతూ “వారు మనుషులు, జంతువులు కారు” అని చెప్పింది. “మీరు మీ మనస్తత్వాన్ని మార్చుకోవాలి. వారు మంచి వ్యక్తులు. నేను వారితో సంతోషంగా ఉంటాను.” ఒక బ్రాహ్మణ స్త్రీకి లైంగికంగా దగ్గరవడానికి సాహసించిన ఒక దళితుడిపై కులాహంకార సమాజం కన్నెర్ర చేసింది. బ్రాహ్మణ స్త్రీల సున్నితమైన పవిత్ర హోదా వారి కుటుంబ గౌరవానికి సంపదలాగా ముడిపడి ఉంటుంది. ఈ గౌరవాన్ని తీసిపారేయడంతో అజితేష్ చచ్చేంత తప్పు చేసాడు. అందుకని అతనితో పాటు ఆ మహిళ కూడా చనిపోవడానికి సిద్ధపడాలి.

ఇటువంటి విపరీతాలు ఏకపత్నీవ్రత/ఏకపతీవ్రత సంబంధాలలో కలుగుతాయి. ఇలాంటి సంబంధాలలో భాగస్వామి చనిపోయేదాకా తనతోనే ఉండాలి అని ఆశించబడుతుంది. ఏడు జన్మలకి అదే భర్తని పొందే బంపర్ ఆఫర్ కూడా ఉందండోయ్. ఈ సంసార పయనం మధ్యలో విడిపోవడం అనేది మామూలే, కానీ ఇది భాగస్వాములలో ఒకరి తప్పుగా భావించబడుతుంది. భారతదేశంలో విడాకులు తీసుకున్న మహిళలను తన కుటుంబంతో సహా ఈ కుల-నిర్బంధ సమాజంలో ఆడామగా అందరూ తక్కువగా చూస్తారు. వారి స్వేచ్ఛ భారతీయ విలువలకి పెద్ద ముప్పుగా ఉంటుంది. ఈ విలువలకి విధవలని వారి భర్త చితిపై కాల్చడం లేదా వారికి గుండు గీసి వారి అందాన్ని నాశనం చేసే చరిత్ర ఉంది. అంబేద్కర్ గారు తన 1916 ఆంత్రోపాలజీ (మానవ శాస్త్రం) పేపర్ “భారత్లో కులాలు” (Castes in India) లో ఏం వాదించారంటే: ఇలాంటి కుల వ్యవస్థ “మిగులు మహిళలను” సృష్టిస్తుంది. కుల సమాజానికే ముప్పుగా ఉంటారు ఇలాంటి ఆడాళ్ళు – వీరు ఎలాంటి దాంపత్య సంబంధంలోనూ ఉండరు, విధవలు కారు. అందుకని వీరు వెలివేయబడతారు – సమాజానికి అంటరానివాళ్లుగా మారతారు.

జాతి
© Pragun Agarwal

హిందూ నాగరికతతో పోరాటం

ఆధునిక భారతంలో ఏమన్నా సామాజిక అభివుద్ది జరిగిందంటే, అది స్త్రీ విముక్తికై ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్న దళిత బహుజన నాయకుల అలుపులేని కృషి వల్లనే. (వారు ఈ మజిలీలలో చాలా సార్లు హిందూ మూఢవిశ్వాసాలన్నీ ‘సంప్రదాయం’ పేరుతో సంరక్షించాలనుకునే స్వాతంత్ర పోరాటం అని పిలవబడే ఉద్యమ అగ్రకుల నాయకుడితో తలబడేవారు)

19వ శతాబ్దపు కింద-కుల సమాజ సంస్కర్తల్లో బహుశా మహారాష్ట్రీయులు జోతిబా మరియు సావిత్రిబాయి ఫూలేల గురించి ప్రస్తుత తరాలకి అత్యంత పరిచయం. ప్రతీ మనిషి హక్కుల కోసం పోరాడిన థామస్ పెయిన్ అనే అమెరికా రాజకీయ ఉదారవాది మరియు విప్లవకారుడిని ఫూలే ఆదర్శంగా తీసుకున్నారు. కరపత్ర రచయిత మరియు సంఘ కార్యకర్తైన ఫూలే మొట్టమొదటగా హిందూ బ్రాహ్మణ ఛాందసత్వాన్ని తన పదునైన పదాలతో విమర్శించాడు. అప్పట్లో హిందూ మూఢనమ్మకాలతో స్త్రీలు చదువుకోడం నిషేధించబడింది. తన భార్యతో కలిసి మొట్టమొదట బాలికలకు మరియు ‘అంటరాని’ కులాల పిల్లలకి స్కూల్ తెరిచి మహిళా విద్యకై అపారమైన పని చేశారు. అలానే పెళ్లికాని బ్రాహ్మణ స్త్రీలకు పుట్టిన బిడ్డలకి అనాధాశ్రమం తెరిచారు. (అప్పట్లో ఛాందసత్వానికి భయపడి ఇలాంటి శిశువులని విడిచిపెట్టడం లేదా చంపెయ్యడం జరిగేది). ఈ దంపతులు విధవ పునర్వివాహం కోసం కూడా బలంగా వాదించారు.

కుల నిచ్చెనలో అతి దిగువ భాగంలో ఉన్న వారి కలుషితమైన దేహాలు సమాజం నుండి అక్షరాలా “బహిష్కరించబడ్డాయి” – పైకి పవిత్ర స్థలాలుగా కనపడే దేవాలయాలలోకి ప్రవేశించకుండా నిరోధించబడ్డాయి.

అలానే తరువాత తరంలో, బ్రాహ్మణ-వ్యతిరేక ఆత్మగౌరవ ఉద్యమ వ్యవస్థాపకులుగా గుర్తించబడే దక్షిణ భారత పండితులు ‘పెరియార్’ ఈవీ రామస్వామి నాయికర్ మహిళా హక్కుల కోసం బలంగా వాదించారు. ఎన్నో రచనల్లో, బ్రాహ్మణ గ్రంధాల బుద్ధిలేనితనాన్ని ఎత్తిచూపారు. మహిళలకు పూర్తి స్వాతంత్రం ఇవ్వాలని, వారు ఇష్టానుసారం విడాకులు ఇవ్వగలగాలి, సంతానం సంసారములకు మించి మహిళలు జీవితాన్ని ఆస్వాదించడానికి గర్భ నిరోధకాలు వాడాలని వాదించారు. పెరియార్ రాసిన మొదటి పుస్తకం గర్భ నిరోధకం మీదనే. మహిళలు ‘స్వతంత్ర జీవితం’ సాగించడానికి అడ్డుపడుతోందని గర్భం దాల్చడాన్ని ఆయన దురదృష్టంగా చూసేవారు.

బ్రాహ్మణ పితృస్వామ్యం మీద పెరియార్ చేసిన సునిశిత విమర్శ రాజకీయాలకు విస్తరించింది. సంప్రదాయ మతానికి ఆచారాలకు సరైన విరుగుడు కుటుంబ నియంత్రణ అని దానికి గట్టి మద్దతు పలికారు. పిల్లలని కనిపెంచడం వారికి వండడం లాంటి భారాలను అందరికీ పంచేలా ప్రభుత్వం సామాజిక వంటశాలలు మరియు శిశుసంరక్షణ కేంద్రాలు పెట్టాలని ఆయన ప్రతిపాదించారు. ఆధునికత్వానికి విధేయుడైన పెరియార్, తమ సమాజంలో సంప్రదాయబద్ధుల నుంచి ప్రతిఘటన ఎదురైనా కుటుంబ నియంత్రణను పెంపొందించిన పశ్చిమ దేశాలను ఉదాహరణగా చూపెట్టారు. తల్లితండ్రులు ‘పిల్లలని కనే కొద్దీ వారు సుఖాలు-సదుపాయాలు తగ్గిపోతాయి” అని రాసారు. అలానే, ఒక దేశంలో జనాభా పెరిగే కొద్దీ ఆ దేశానికి కరువు, దారిద్య్రం పెరిగి మరియు సామాన్య జీవితం కోసం కనీస అవసరాలు లేకుండా పోతాయి”. క్లుప్తంగా చెప్పాలంటే, పెద్ద కుటుంబాలు సంక్షేమ రాష్ట్రం నిర్మించడానికి అడ్డుగా ఉంటాయి. (ఆయన వేరే చోట ఘాటుగా అన్నట్టు “ప్రజల్లో జీవించాలంటే బిడ్డ ఉండడం గుదిబండ”). పెరియార్ గారి విప్లవ తత్త్వం బహు-భర్తలు ఉండడాన్ని సమర్ధించింది, ఆయన దృష్టిలో వివాహబంధం మరియు పాతివ్రత్యం అనే వ్యవస్థలు పితృస్వామ్య-బద్ధంగా మహిళలకు వ్యతిరేకంగా ఉంటాయి. పురుషాహంకారం మీద ఆయనకున్న ద్వేషానికి సరితూగే విద్వేషం కులాహంకారం పై మాత్రమే ఉంటుంది.

అయినా అందరికన్నా కూడా బ్రాహ్మణ పితృస్వామ్య మూలాల మీద నిరంతర దాడి చేసిన వ్యక్తి – బి. ఆర్. అంబేద్కర్. భారత్లోనే అగ్ర మేధావి, రాజ్యాంగవేత్తైన అంబేద్కర్ జానపద గాథల్లో చెప్పుకునే మహాపురుషుని లాంటివారు. బొంబాయి ప్రాంతం నుంచి కాలేజీ డిగ్రీ పట్టా సాధించిన మొదటి అంటరానివాడు, భారతంలో తన కులం నుంచి విశ్వవిఖ్యాత కొలంబియాలో పై చదువులు చదివిన వ్యక్తి అంబేద్కర్. నేడు దేశంలో అత్యంతగా ఆరాధించబడే మేధావి, దళితోద్యమ స్థాపకులు ఆయన. మానవ శాస్తం, సమాజ శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, మతం నుంచి ఫ్రెంచి చరిత్ర, ఆంగ్ల సాహిత్యం మొదలగు అంశాల వరకు చదివిన ఆయన పలు భాషా ప్రవీణుడు, పలు శాస్త్రకోవిదుడు. (మొత్తంగా అక్కడ సుమారు 60 కోర్సులు చేసారు). అక్కడ జాన్ డూవి అనే నీతిజ్ఞుడి కింద చదివారు. 1915లో కొలంబియా నుంచి తన M.A. చేసిన తరవాత, 1916లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డ్.ఫీల్ కోసం పరిశోధన మొదలు పెట్టడంతో పాటు బారిష్టర్ అవ్వడానికి చదువు ప్రారంభించారు. 1917లో ఇండియాకు తిరిగొచ్చి 1921లో మళ్ళీ లండన్ కు పయనమయ్యారు. 1923లో ఆర్థిక శాస్త్రంలో పండిత పట్టంతో పాటు బారిష్టర్ కూడా అయ్యారు. 1928లో కొలంబియాకు తిరిగొచ్చి డాక్టరేట్ అందుకున్నారు. దీని తరవాత ఇండియాకు తిరిగొచ్చి మొదలెట్టిన రాజకీయ ప్రస్థానం దేశం రూపురేఖల్నే మార్చేసింది. అలుపు లేకుండా కింద కులాల సామాజిక రాజకీయ ఉద్యమాలను ఆరంభించి కొనసాగించారు, వార్తాపత్రికలు నడిపారు, కార్మికులను కూడగట్టారు, పార్టీలు స్థాపించారు, ఎన్నికలలో పోటీ చేశారు. వీటికి తోడు స్వాతంత్ర భారత రాజ్యాంగ ముసాయిదా రచించారు, మరో వైపు క్షుణ్ణంగా పరిశోధించబడ్డ పుస్తకాలు రాత్రిళ్ళు రాస్తూనే ఉన్నారు. ఇంకో పక్క స్వాత్రంత్ర పోరాటం నుంచి కులాహంకారుల నిరంతర దాడులను తిప్పి కొడుతూ ఉండేవారు.

తన రాజకీయ పోరాటాలలో మహిళలకు సంబంధించిన అంశాలకు పెద్ద పీట వేశారు. 1928లో బొంబాయి శాసన సభలో స్త్రీలకు జీతంతో కూడిన ప్రసూతి సెలవు ఇచ్చే బిల్లుకు బలంగా మద్దతిచ్చారు. 1938లో గర్భ నిరోధకం కోసం ఆయన తరఫున సహచరుడు పి. జె. రోహం బిల్లును ప్రవేశపెట్టారు, దురదృష్టవశాత్తూ ఇది ఆమోదించబడలేదు. సంతానం కనే హక్కు మహిళలకు మాత్రమే ఉంటుందని ఆయన నమ్మారు. 1930లు, 1940లలో, స్త్రీ విముక్తి కోసం వచ్చిన పలు బిల్లుల కోసం ఆయన పోరాడారు కానీ ఇవన్నీ చివరికి సంప్రదాయవాద రాజకీయవేత్తల వలన నీరుకార్చబడేవి. కానీ ఆయన జీవితంలో అత్యంత గొప్ప అతి విషాదకర క్షణాలు ఆయనే రచించి పార్లమెంటులో 1951లో ప్రవేశ పెట్టిన హిందూ కోడ్ బిల్ తో ముడి పడి ఉన్నాయి. దీని ద్వారా హిందూ మహిళకి వివాహం, విడాకులు, దత్తత, ఆస్తి విషయాల్లో పూర్తి సమానత ఇచ్చి హిందూ మత వ్యవస్థ యొక్క మహిళా అణచివేతను పూర్తిగా రూపుమాపడానికి ప్రయత్నించారు. ఈ బిల్లును పార్లమెంట్ లోనా బయటా తిరోగమన శక్తులు ఛాందసవాదులు వ్యతిరేకించారు. ఈ అనుభవం చివరికి అంబేద్కర్ న్యాయ మంత్రి పదవి నుంచి రాజీనామా చేయడానికి దారి తీసింది. (ఇదే బిల్లును బలహీనం చేసి చాల ఏళ్ల తర్వాత ఆమోదించారు).

కులం గురించిన అంబేద్కర్ గారి సిద్ధాంతం వ్యవస్థలో మహిళల బాధలపై ఉన్న అవగాహన మీద ఆధారపడి ఉంది. స్త్రీలు కుల వ్యవస్థ నడవడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. కులాధారంగా జరిగే లింగ ఆచారాల వల్లనే హిందూ బ్రాహ్మణా వ్యవస్థ నిలబడుతుందని గుర్తించారు. స్త్రీలకు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగే శక్తి లేదని వారిపై నిర్దిష్టమైన ప్రవర్తన నియమాలు విధింబడ్డాయి. డిసెంబర్ 12, 1938న షెడ్యూల్డ్ కుల విద్యార్థుల సదస్సులో ప్రసంగిస్తూ, విద్య, ఉపాధి, వైవాహిక సంబంధాల్లో స్త్రీ-పురుష సమానత అవశ్యం అని ఉద్ఘాటించారు. “నేను ఎందరో అందమైన అమ్మాయిలని అతివికారమైన మగాళ్ళకి ఇచ్చివేయడం చూసాను”, అని చెప్పారు.

ఈ దేశంతో నేను అలసిపోయాను . . . ఇక్కడి మతం, సమాజ వ్యవస్థ, సంస్కరణలు, సంస్కృతితో నాకు చాలా విసుగెత్తాయి. నాగరికతో నేను యుద్ధం చేస్తున్నా.” 10 ఏళ్ల ముందు, 1927లో, బహిరంగంగా మనుస్మృతిని కాల్చే కార్యక్రమం నిర్వహించారు. అతి నీచ స్త్రీ-ద్వేషాన్ని కోడీకరించిన ప్రాచీన హిందూ గ్రంధం మను స్మ్రుతి. (మూడవ అధ్యాయం 8వ సెక్షన్లో దూరంగా ఉంచాల్సిన మహిళల జాబితా ఉంటుంది: శరీరం మీద అసలు వెంట్రుకలు లేని లేదా మరీ ఎక్కువ వెంట్రుకలు ఉన్నవారు, ఎక్కువగా మాట్లాడేవారు, ఎర్రజుట్టున్నవారు). కానీ మనం గొప్ప పురుషలను మాత్రమే కాకుండా కుల వ్యవస్థని పోరాడిన దళిత మహిళలను కూడా గుర్తించాలి. తమ ప్రసిద్ధి గాంచిన రచన, చరిత్ర మేం కూడా రాశాం (We Also Made History – 1989)లో, పండితులు మీనాక్షి మూన్ మరియు ఊర్మిళ పవార్ ఇలాంటి మహిళల చరిత్రను లోతుగా పరిశీలిస్తారు. ప్రాచీన లేదా పాత దస్తావేజులను, క్షేత్ర స్థాయి పరిశోధన వివరాలు శోధిస్తూ, అంబేద్కర్ వాద ఉద్యమం ముందూ తర్వాత కాలంలో దళిత మహిళలు సాధించిన స్త్రీవాద విజయాల గురించి వివరించారు.

ప్రేమలు పెళ్లిళ్లు

భారత్లో స్త్రీవాదానికి ముఖ్యమైన పోరాటం కుల వివక్షపై జరిపే పోరాటమే. బ్రాహ్మణ శైలిలో జరుగు వివాహాలు స్త్రీలను అన్ని విధాలా బలహీనపరుస్తాయి. ఇంకా అధ్వాన్నమయిన విషయం ఏంటంటే, విడాకులు ఇప్పటికి కూడా మహిళల గుణానికి మచ్చ తెచ్చే పాపంలా చూడబడతాయి. కానీ ఇది పురుషులకు వర్తించదు. అందుకే ఇంకా చాలా మంది స్త్రీలు పురుషుల క్రూరత్వాన్ని అణచివేతను ఇంకా సహిస్తారు. సమాజం వారికిచ్చిన అనైతిక అధికారంతో వారు స్త్రీలను నియంత్రిస్తారు, మోసగిస్తారు.

ఇలాంటి పరిస్థితులలో ప్రేమ దారి చూపగలదా? నిజం చెప్పాలంటే ఇండియాలో కులాంతర ప్రేమ వివాహం అవమానకరంగానూ విడ్డురంగానూ ఉంటుంది. ప్రేమించి పెళ్లాడిన జంటలను సమాజం వింతగా చూస్తుంది. వాళ్ళు ఎలా చేసుకోగలిగారు? ఎందుకు? అసలు ఎలా ఉంటుంది ఈ వివాహం? సినిమాల్లో చూపించే ప్రేమ కథల్లో కులం మాట ఉండదు కాబట్టి చూసే వాళ్లకు నిజ జీవితంలో ఇలాంటి వాటిపై తక్కువ అవగాహనే ఉంటుంది.

ప్రేమ పెళ్లిళ్లు కేవలం మనోభావాల మీద ఆధార పడి ఉంటాయన్నది నిజమే, ఆస్తి కోసమో పవిత్రమైన డిఎన్ఏ ఉండడానికో కాదు. కానీ మనం వీటిని ఆకాశానికి ఎత్తేయకూడదు, ఇండియాలో రాత్రికి రాత్రి మార్పు వస్తుందని అనుకోకూడదు. హిందూ మతవిషం భారత సమజాంలో ఎంతో లోతుగా ప్రవహిస్తూ ఉంటుంది. బ్రాహ్మణ పితృస్వామ్య వ్యవస్థ ఇప్పుడు మెల్లగా మట్టికరుస్తున్నా కూడా ప్రేమ గురించిన హిందూ స్వభావాలు మారడానికి ఇంకా చాలా పోరాటం జరగాలి. ఇప్పుడున్న హిందుజానిత ఊహా గాథల్లో, పెళ్ళైన భాగస్వాముల మధ్య ఉన్న ప్రేమ నమ్మకం లేనిది, అసాధ్యమైనది. తమ కోరికలపై తమకున్న అసహ్యం లేదా సందేహాలు మానసిక లేదా శారీరక హింసకు దారి తీస్తాయి.

భారతీయ ఇళ్లల్లో సాధారణంగా వాడబడే పదాలు – జోరు కా గులాం (పెళ్ళాం బానిస). ఇది ఎక్కువగా భార్యలను ఆరాధించే పురుషలకు వాడతారు. తమ భాగస్వామిని బహిరంగంగా మెచ్చుకునే పురుషులను హేళన చేస్తారు. భార్యని ప్రేమించడం బలహీనతకు చిహ్నంలా చూస్తారు, లొంగిపోయాడని అంటారు. ఇదీ మన పితృస్వామ్య వారసత్వం: సమాజం యొక్క క్రూరత్వాన్ని రుచి చుసిన తర్వాత అబ్బాయిలు ఆప్యాయతను కాదని పిచ్చెక్కి అదుపుతప్పిన మగాళ్లగా మారతారు – ఇదే సరైన గుణమని సమాజం పదే పదే చెప్పి వాళ్ళను ఇలా తయారు చేస్తుంది.

అలాగని మనం ప్రేమ సంబంధాలు వివాహాలే గొప్పవని చెప్పకూడదు. కుదిర్చిన దారిలో కానీ ప్రేమ దారిలో కానీ పెళ్లి చేసుకోవాలి అనే ఒత్తిడి సంప్రదాయ సమాజాలలో చాలా బలంగా ఉంటుంది, యువతను చాలా కష్టపెడుతుంది. సమాజ ఒత్తిళ్లు బంధువుల గొడవ పడలేక తల్లితండ్రులు పిల్లలని సంప్రదాయబద్ధమైన తరహాలో పెళ్లి చేసుకోమని బుజ్జగిస్తారు. ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవడం కన్నా అది తల్లితండ్రుల పెళ్లి అవుతుంది. పెళ్లి వేడుకలు జరుగుతున్నప్పుడు, వారి పిల్లల భవిష్యత్తు గురించి ఓపక్క ఎంతో టెన్షన్ గాను మరో పక్క ఎంతో ఆనందంగా ఉండే తల్లితండ్రులను సులభంగా గుర్తు పట్టొచ్చు. ఇండియాలో సగటున 22 ఏళ్లకు పెళ్లి చేసుకుంటారని గుర్తుంచుకోవాలి, అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఈ సగటు సుమారు 30 ఉంటుంది. ముందుగానే కుటుంబ సంస్కృతి గురించి అలవాటు చెయ్యడం ఇక్కడ మామూలు, అసలు నువ్వున్నదే సంతానం కనడానికి అని నమ్ముతారు. మగ బిడ్డకి జన్మనిస్తే అది వీర విజయం అవుతుంది. ఇంత రోగం పట్టిన సమాజమున్న ఇండియాలో బ్రహ్మచారులనే రోగుల్లా చూస్తారు. తమ లింగానికి వ్యతిరేక లింగానికి చెందిన వారైనా స్వలింగ సంపర్కులైనా తమ సంతానం సంసారాన్ని ఆనందించడం కన్నా పెద్దలకు ఇంకేమి అక్కర్లేదు. ఇక్కడి పెద్దలు భిన్న లింగసంపర్కం లేదా (చాలా అరుదైన సందర్భాల్లో) స్వలింగసంపర్క జీవితం అనే “సాధారణ స్థితిని” తమ పిల్లలకు కోరుకుంటారు. చాలా అరుదుగా బ్రహ్మచారిగా ఉన్న మనిషిని ఆదర్శంగా చూపెడతారు.

తమ భాగస్వామిని బహిరంగంగా మెచ్చుకునే పురుషులను హేళన చేస్తారు. భార్యని ప్రేమించడం బలహీనతకు చిహ్నంలా చూస్తారు, లొంగిపోయాడని అంటారు.

ఆర్థికపరంగా కూడా ఒక వయసొచ్చాక బ్రహ్మచారులని ఎంతో సందేహంగా చూస్తారు. “అసలు ఎవరన్నా ఇలాంటి అనవసరమైన ఆచారాలు అనుసరించకుండా కావలసినట్టు జీవితాన్ని ఎందుకు గడుపాలనుకుంటారు?” అని సమాజం సందేహిస్తుంది!

ఈ సమస్యలను కాపిటలిజం – పెట్టుబడిదారీ వ్యవస్థ – ఇంకా తీవ్రతరం చేసింది. సంతానం కనడం అనేది మన జీవిత శైలిని శాసించే బాకీల పరిశ్రమకు బాగా సరిపోతుంది. బ్యాంకు నియమావళి పాటిస్తూ వీరి తరహా పొదుపు చేసే విధానానికి సరిపోయేలా మన కోరికలూ కలలని కనాలి. చాలా సార్లు, బాకీ పుస్తకం ప్రకారం కలలు కంటాం. ఏం కల కనాలి, ఎంత కల కనాలి అనేది దోపిడీదారి కార్పొరేట్ పరిశ్రమలు నిర్ణయిస్తాయి. చాలా సార్లు భాగస్వామి ఎవరనేది మార్కెట్ నియమాలను బట్టి ఉంటుంది. జేబులో డబ్బులను బట్టి ఒకరు లోపలికి వెళ్లడం లేదా బయటికి రావడం జరుగుతుంది. ఉద్యోగం ఉంటుందో లేదో అన్న వేదన, బాకీలు తీర్చాల్సిన భారం లాంటివి భరించాలంటే ఒంటరి జీవితానికి కానీ పని. అలా బ్రహ్మచారి మజిలీలలో జీవితం అనే వ్యధ పెరుగుతూ పోతుంది. ఇంత ఒంటరిగా ఇంత దౌర్భాగ్యంగా ఉండకూడదంటే మీరు భాగస్వామిని తప్పక తెచ్చుకోవాలి.

ప్రేమాభిషేకం – కబీర్ దాసు ఏమన్నారంటే

భారత్లో పరిస్థితులు ఎంత బాగాలేకున్నా, అక్కడున్న యువశక్తీ తపనా విప్లవాత్మకమైనది, వీరి ఆరాటం సమూల మార్పును కోరుకుంటోంది. హిందూ సమాజ పక్షపాతాలకు యువత – కనీసం వారిలో కొంతమందైనా – ఇంకా ప్రభావితం కాలేదు. చైతన్య శక్తులు వీరి నుంచే పుట్టుకురావొచ్చు.

యువ భారతీయులు ఏ అడ్డంకుల్లేని ప్రేమను అవలంబించాలి. ప్రేమనేది సుఖానికి మాత్రమే కాదు అది ఒక గాఢమైన అనుభవమని అర్ధం చేసుకోవాలి. పెళ్లి విషయానికి వస్తే, పెళ్లి తరవాత ఉండాల్సిన వసతులు పొందుపరుస్తూ మనకి ఒక వివాహ ప్రణాళిక/మేనిఫెస్టో కావాలి. ఆడాళ్ళు మగాళ్లు తమకు ఎంతో ముఖ్యమైన విషయాలు అరమరికలు లేకుండా ముందే మాట్లాడుకోవాలి. అబ్బాయికి అమ్మాయికి జరిగే పెళ్ళిళ్ళకి మించి ఇద్దరు ఆడాళ్ళ మధ్య లేదా మగాళ్ల మధ్యా ఇతరత్రా కొత్త కొత్త పెళ్లిళ్లు పుట్టుకొస్తాయి. వధూవరుల వివాహ మానిఫెస్టోలో, వధువు తన అవసరాలు, ఆశలు, లైంగిక ప్రాధాన్యతలు, తన మారుతున్న హావ భావాలు మరియు పాత్రలతో వరుడు ఎలా మసులుకోవాలో తప్పక చెప్పాలి. వరుడు కూడా వధువుతో తన గురించిన విషయాలు ఇలానే పంచుకోవాలి. ప్రేమ అనేది అందరికి అందుబాటులో ఉండాలి, ఏదో మనం పొందలేని ఊహాజనితమైన ఆలోచన అవ్వకూడదు.

15వ శతాబ్దపు భక్త-కవి కబీరు భారత్లోని మహోన్నతమైన కుల-వ్యతిరేక జ్ఞానులలో ఒకరు. తన పుస్తకం ఆన్ ది సాంగ్స్ అఫ్ కబీర్ (On the Songs of Kabir)లో రచయిత ఓషో ఇలా పేర్కొన్నారు: “ఒక స్త్రీని నిజంగా ప్రేమించాలనుకుంటే తనని ఎప్పటికీ పెళ్లాడకు. ఒక పురుషున్ని నిజంగా ఆరాధించాలనుకుంటే, తన నుంచి వీలైనంత దూరం పారిపో. అలాంటప్పుడే నువ్వు ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటావ్. కానీ ఈ ప్రేమాయణం మొత్తాన్ని నాశనం చేయాలంటే పెళ్లి చేసుకో.” తన భోళా తేలికైన రీతిలో కబీరు ఇలా అంటారు: “ప్రేమా నిలయం ఎంతో ఉన్నతంగా ఒంటరిగా ఉంటుంది.” అందుకని, “ప్రేమను నిలబెట్టుకోవడం కఠినం, అందరూ దానిని నిలబెట్టుకోలేరు.” అందుకని పెళ్లి అనేది పరిపక్వతలేని వెనకడుగు అవుతుంది.